Monday, 15 April 2019

సత్యం వద-కాలము-పంచాంగము-పండగలు.

సత్యం వద-కాలము-పంచాంగము-పండగలు. 

కాలం అనంతం. అనంతమైన కాలాన్ని దైవంగా భావించారు భారతీయులు. ఈ కాలాన్ని గణించిడానికి ఉపయోగించిన పద్ధతులు ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. అవి, 

౧.సూర్యుని బట్టి కాలాన్ని గణించడం
౨.చంద్రుని బట్టి కాలాన్ని గణించడం.
౩.నక్షత్రాలని బట్టి కాలాన్ని గణించడం
౪.గురు గ్రహాన్ని బట్టికాలాన్ని గణించడం

ఇన్ని రకాలుగా కాలగణన ఎందుకు చేశారు? ఒక్కో ప్రాంతం వారు వారికి నచ్చిన ఆచారాన్ని అనుసరించారు. ఉత్తరాదివారంతా గురువును బట్టి కాలాన్ని అనుసరిస్తారు. మహరాష్ట్ర తెలుగువారు సూర్యచంద్రులను అనుసరించి కాలం అనుసరిస్తారు. ఇక తమిళనాడువారు సూర్యుని బట్టి కాలాన్ని అనుసరిస్తారు. ఇక నక్షత్ర మానం రైతులకు వ్యవసాయానికి అవుసరం వారు దానిని అనుసరించి కార్తెలు వగైరా, వర్షము వగైరా చెప్పుకుంటారు, ఎవరి పంచాంగం వారిదే. 

పంచాంగం లో ముఖ్యంగా చూసేవి,తిథి,వారం,నక్షత్రం,యోగం,కరణం.  పంచాంగం గుణించడానికి రెండు పద్ధతులు, సనాతన సిద్ధాంతం,దృక్ సిద్ధంతం. సనాతన సిద్ధాంతంలో మార్పులు చేసుకుంటూ సూచించుకుంటూ వచ్చారు. కాలంతో మారేరు కాని కొంతమంది కాలంతో మారలేక పాత పద్ధతినే పట్టుకు వేలాడుతున్నారు. వీరి సంఖ్య బహు స్వల్పం. ఇక దృక్ సిద్ధాంతం లో పంచాంగం చేసేవారు గుణితం చేసుకుని భారత ప్రభుత్వం ప్రచురించే ఎఫిమరీలు తెప్పించుకుని తాము గుణించినది ఎఫిమరీలు ఇచ్చిన ఫలితాలు సరి చూసుకుంటుంటారు. ఎక్కువమంది దృక్ సిద్ధాంతం అమలు పరుస్తున్నారు. 

కాలగణనలో రోజు అంటే సూర్యోదయం నుంచి మరుసటి దినం సూర్యోదయ కాలం దాకా ఒక రోజని నిర్ణయం. ఇలాటి ఒక రోజును సావన దినం అంటారు. ఇటువంటీవి ౩౬౦ రోజులు ఒక సావన సంవత్సరం. దీనికో పేరు, అది కూడా ప్రభవ వగైరాల్లోనే ఉంటుంది.  ఇదికాక ఇప్పుడు పంచాంగంలో చెప్పే సంవత్సరమూ ఉన్నది. 

పంచాంగం రాసేవారిని సిద్ధాంతి అంటారు. వీరు పంచాంగం రాస్తారు, దీనిని వివరించి చెప్పేవారు పురోహితులు. వీరిద్దరి మధ్య తేడా గమనించాలి. పంచాంగంలో స్మార్త,వైష్ణవ అని రాస్తుంటారు. వీరెవరు? వైష్ణవులంటే విష్ణువు ప్రధాన దేవునిగా కీర్తించేవారు. ఇక శైవులు శివుడే అత్యున్నతం అని కీర్తించేవారు. ఇక స్మార్తులు అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనేవారు. శివ,కేశవులను సమానంగా ఆరాధించేవారు. వీరు శ్రీ శంకరాచార్యులవారి అనుయాయులు. శంకరులంటే ఆరు మతాలను ఏకంచేసిన వారు. 

పండుగలు అన్నవి సూర్యమానం ప్రకారంగా సంక్రాంతి, వగిరాలు చంద్రమానం ప్రకారంగా నక్షత్ర మానం ప్రకారంగా వచ్చేవి. వైష్ణవాలయాలన్నీ నక్షత్ర ప్రధానంగా రామనవమి,కృష్ణాష్టమి వగైరా జరుపుతాయి. ఐతే తిధి ప్రకారంగా, చాంద్ర మానం ప్రకారంగా,  స్మార్తులు జరుపుకుంటారు. ఇక ఈ తిథులలో తగులు,మిగులు అని కూడా చూస్తారు. రోజులో ఎప్పుడు తిథి వచ్చినా ఆరోజునే పండగ జరుపుకోవడం స్నార్తులు చేస్తారు. మిగులు అనగా తిథి మరుసటి రోజుకు కూడా ఉంటే అప్పుడు పండుగ చేసుకుంటారు వైష్ణవులు. 

రోజు తిథి నిర్ణయం ఎలా? సూర్యోదయానికి ఉన్న తిథి ఆరోజుకు తిథి అవుతుంది సంకల్పంలో తిథి అదే చెప్పుకోవాలి, ఆ తరవాత లేకపోయినా! ఇక ఆబ్దీకానికైతే తిథి అపరాహ్ణానికి ఉన్నదే ఆబ్దీకానికి తిథి! ఇలా చాలా తేడాలున్నాయి, వీటిని నిర్ణయించేందుకో గ్రంధం ఉంది అదే ధర్మ సింధువు. 

చివరగా ఇన్ని వైవిధ్యాలు,వైరుధ్యాలు ఎందుకు?  అబ్రహామిక్ మతాలలో వైవిధ్యం కనపడదు. సనాతనంలో ఒక్కో ప్రాంతంలో, కొంత మంది వ్యక్తులు, సమూహాలు తామునమ్మినదానిని,తమ పెద్దలు ఆచరించినదానిని ఆచరిస్తారు, ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కాదు. నిజానికిది వైరుధ్యంకాదు,వైవిధ్యమే! సనాతన ధర్మం కాలాన్ని బట్టి మారింది,మారుతుంది. సనాతన ధర్మంలో ఎవరి ఇష్టమైన దేవుని వారు ఆరాధించుకునే స్వాతంత్ర్యం ఉంది, అలాగే ఎవరికి నచ్చిన రీతిని వారు పండుగ చేసుకునే ఆచారమూ ఉంది. అబ్రహామిక్ మతాలను చాలా దగ్గరగా చూస్తున్నందువలన, వాటిలో కొన్నిటిని తెలియకనే ఆచరిస్తున్నందువలన ఒక రోజు అందరూ పండగ జరుపుకోకపోవడం వైరుధ్యంగా కనపడుతోంది. ఇదే ఏకత్వంలో బిన్నత్వం,భిన్నత్వంలో ఏకత్వం. 

పిడివాదులకో నమస్కారం. 

1 comment:

విన్నకోట నరసింహా రావు said...

చాలా వివరంగా చెప్పారు శర్మ గారు. ధన్యవాదాలు.

Post a Comment